ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది మృతి

Bus and truck collision in Barabanki.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగి ఉన్న డ‌బుల్ డెక్క‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2021 2:24 AM GMT
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగి ఉన్న డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సును ట్ర‌క్కు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 18 మంది అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత ఈ ఘ‌ట‌న బారాబంకిలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని లూధియానా నుంచి ప్ర‌యాణికులతో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు బిహార్ వెలుతోంది. ఈ క్రమంలో బారాబంకి రామ్‌స్నెహిఘాట్ కొత్వాలి ప్రాంతంలోని లక్నో – అయోధ్య జాతీయ రహదారిపై బస్సు ఆగి ఉండగా.. లక్నో వైపు నుంచి వస్తున్న ట్రక్కు వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

క్ష‌త‌గాత్రుల‌ను లక్నో ట్రామా సెంటర్ కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతుల‌ను బీహార్ వాసులుగా గుర్తించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగింది. దాదాపు రాత్రంతా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగాయి. ఈ ఘ‌ట‌న త‌రువాత హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయ్యింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప్ర‌యాణీకులు గాఢ నిద్ర‌లో ఉన్నారు. ట్ర‌క్కు చాలా బలంగా ఢీ కొట్ట‌డంతో.. బ‌స్సులోని కొద్ది మంది రోడ్డు పై ప‌డ్డారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. క్ష‌త‌గాత్రుల రోద‌న‌తో మిన్నంటాయి. మృతుల వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story