తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్య అనేది శాశ్వత పరిష్కారం కాదని తెలిసినా.. చాలా మంది క్షణికావేశంలో తమ ప్రాణాలను అర్పించుకుంటున్నారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. 'తెలిసీ తెలియక అప్పులు చేశా… వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త' అంటూ లేఖ రాసి తాజాగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గకు చెందిన మామిడి లక్ష్మీసాయి(22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. గత నెల 31న ఇంటర్వ్యూ ఉందని హైదరాబాద్‌కు వచ్చాడు. గురుద్వారా ఏరియాలోని లోటస్ గ్రాండ్ హోటల్‌లో దిగాడు. రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో.. రూమ్ బాయ్ తలుపు కొట్టాడు. ఎంతకు తలుపు తీయకపోవడంతో హోటల్ యాజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తలుపులు తెరిచి చూడగా బాత్‌రూమ్‌లో బైండింగ్ వైర్‌తో లక్ష్మీసాయి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూమ్‌లో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. సోమవారం రాత్రి చివరి ఫోన్‌కాల్ ఉండటంతో అదేరోజు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్‌నోట్ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.