టీడీపీ నాయకుడి దారుణ హత్య

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేశారు.

By అంజి  Published on  14 Aug 2024 10:15 AM IST
Brutal murder, TDP leader, Andhra Pradesh

టీడీపీ నాయకుడి దారుణ హత్య

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీకి చెందిన వారే హత్య చేశారని, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని లోకేష్‌ ఆరోపించారు.

ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

Next Story