హైదరాబాద్‌లో దారుణం.. వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రెడ్డి కాలనీలో ఒక మహిళపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By - అంజి |
హైదరాబాద్‌లో దారుణం.. వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రెడ్డి కాలనీలో ఒక మహిళపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం వికటించి, కక్షతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాకినాడకు చెందిన నూకరత్నం (25) అనే మహిళ మియాపూర్‌లోని రెడ్డి కాలనీలో నివసిస్తూ హౌస్‌కీపింగ్ పనులు చేస్తోంది. భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, గత ఫిబ్రవరి 20న ఆమె అతడిని వివాహం చేసుకుంది. అయితే, నూకరత్నం పనిచేసే చోటే వంటవాడిగా ఉన్న ఆలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. తనను కాదని ప్రసాద్‌ను వివాహం చేసుకుందన్న కోపంతో పాండు ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.
ఈ నెల 19వ తేదీన నిందితుడు పాండు తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లాడు. తనతో రావాలని ఆమెపై ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన పాండు, తాను వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు గమనించి వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడు పాండుతో పాటు అతని తండ్రి లాలూను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.