పాలు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 11 కేవీ విద్యుత్ వైరు తెగి బైక్‌పై పడడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఈ విషాదఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో వల్లేపల్లి నాగేంద్ర(21), ఫణీంద్ర(19) అనే అన్నాదమ్ములు తమ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. తెల్లవారుజామున పాలు తీసుకువచ్చేందుకు ఇద్దరూ కలిసి బైక్‌పై పొలం వద్దకు వెలుతుండగా.. మార్గమధ్యంలో 11 కె.వి విద్యుత్ వైర్లు తెగి వారు ప్రయాణిస్తున్న బైక్‌పై పడింది. మంటలు చెలరేగి బైక్‌పై ఉన్న అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. చేతికందివచ్చిన కుమారులిద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. మృతుల్లో నాగేంద్ర ఇంజినీరింగ్ ఫైనల్ చదువుతుండగా, ఫణీంద్ర ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు.
కాగా.. అన్నదమ్ముల మృతికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ తీగల సమస్య ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబానికి రూ.25లక్షల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.