సోషల్ మీడియా తెచ్చిన లొల్లి.. అన్న చేతిలో హతమైన చెల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటాన్ని సహించలేకపోయిన ఓ అన్న.. తన సొంత చెల్లెల్ని చంపేశాడు.
By అంజి Published on 26 July 2023 9:06 AM ISTసోషల్ మీడియా తెచ్చిన లొల్లి.. అన్న చేతిలో హతమైన చెల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటాన్ని సహించలేకపోయిన ఓ అన్న.. తన సొంత చెల్లెల్ని చంపేశాడు. ఎంత చెప్పినా వినకుండా చెల్లెలు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతోందని అన్న ఆగ్రహించాడు. ఆమెను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం నాడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అజ్మీరా సింధు, అజ్మీరా హరిలాల్ ఇద్దరు అన్నా చెల్లెళ్లు. వీరి తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోగా, తల్లి అజ్మీరా దేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మహబూబాబాద్‌లో ఏఎన్‌ఎం అప్రెంటిస్ చేస్తున్న సింధు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తరచూ రీల్స్, వీడియోలు పోస్ట్ చేసేది. ఇది నచ్చని అన్న హరిలాల్ ఆమెతో తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ మరింత ముదిరింది. సోషల్ మీడియా పోస్టుల విషయమై సోమవారం నాడు సోదరుడు హరిలాల్, సింధు మధ్య గొడవ జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆవేశంతో సోదరుడు సింధుపై రోకలిబండతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
ఆమెను వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ తీసుకెళ్తుండగా సింధు మృతి చెందింది. ఆవేశంతో చెల్లెల్ని రోకలిబండతో కొట్టి అన్న.. ఆ తర్వాత రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు హడావిడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి చేరుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే హరిలాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.