పెళ్లికి నిరాక‌రించింద‌ని దారుణ హ‌త్య‌

Boyfriend killed his girlfriend in Wanaparthy District.ప్రేమించిన యువ‌తి త‌న‌తో పెళ్లికి నిరాక‌రించింద‌ని ప్రియుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2022 2:57 AM GMT
పెళ్లికి నిరాక‌రించింద‌ని దారుణ హ‌త్య‌

ప్రేమించిన యువ‌తి త‌న‌తో పెళ్లికి నిరాక‌రించింద‌ని ప్రియుడు క‌క్ష గ‌ట్టాడు. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాల‌ని అనుకున్నాడు. పెళ్లికి ఆ యువ‌తి స‌సేమీరా అనింది. అయితే.. ఓ సారి మాట్లాడుకుందాం అని న‌మ్మించి ఆ యువ‌తిని తీసుకెళ్లి గొంతు నులిమి హ‌త్య చేశాడు. అనంత‌రం బంధువు సాయంతో మృత‌దేహాన్ని పూడ్చిపెట్టాడు. వ‌న‌వ‌ర్తి జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఖిల్లాగ‌ణ‌పురం మండ‌లం మానాజీపేట‌కు చెందిన శ్రీశైలం కు 2017లో హైద‌రాబాద్‌లో డిగ్రీ చ‌దువుకునే రోజుల్లో కాటేదాన్ ఏరియా ఎన్జీవోస్ కాల‌నీకి చెందిన సాయి ప్రియ‌(19)తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. సాయి ప్రియ‌ను పెళ్లి చేసుకుంటాన‌ని శ్రీశైలం ఇరు కుటుంబాల‌కు చెప్ప‌గా.. సాయి ప్రియ కుటుంబ స‌భ్యులు ఇందుకు నిరాక‌రించారు.

తల్లిదండ్రుల మాటలకు లోబడి సాయి ప్రియ.. అత‌డితో మాట్లాడటం మానేసింది. క‌రోనా కార‌ణంగా శ్రీశైలం కుటుంబం వారి స్వ‌గ్రామం మానాజీపేట‌కు వెళ్లింది. కాగా.. మూడు నెలల క్రితం మళ్లీ వారి మధ్య మాటలు కలిశాయి. ఈ క్ర‌మంలో ఈ నెల 5న సాయిప్రియ‌కు ఫోన్ చేసి ఓసారి మాట్లాడాల‌ని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా భూత్పూర్‌కు రావాల‌ని కోరాడు. అక్క‌డి నుంచి బైక్‌పై ఎక్కించుకుని మానాజీపేట శివారులోని మ‌బ్బుగుట్ట‌లోకి తీసుకువెళ్లాడు శ్రీశైలం. అక్క‌డ మ‌రోసారి త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోరాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన శ్రీశైలం.. సాయిప్రియ గొంతుకు చున్నీ బిగించి హ‌త్య చేశాడు.

అనంత‌రం మృత‌దేహాన్ని త‌న బంధువు శివతో క‌లిసి కేఎల్ కాల్వ స‌మీపంలో గుంత త‌వ్వి పూడ్చిపెట్టాడు. అప్ప‌టికే కుమారై క‌నిపించ‌క‌పోవ‌డంతో సాయి ప్రియ త‌ల్లిదండ్రులు మైలార్ దేవ్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీశైలం పై అనుమానాన్ని వ్య‌క్తం చేయ‌గా.. పోలీసులు అత‌డిని అదుపులోకి విచారించ‌గా అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. గురువారం ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు త‌హ‌శీల్దార్ స‌మ‌క్షంలో మృత‌దేహాన్ని వెలికి తీశారు. అక్క‌డే మృత‌దేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించారు.

Next Story