ప్రియురాలు మోసం చేసిందని.. ప్రియుడు ఆత్మహత్య
ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
By - అంజి |
ప్రియురాలు మోసం చేసిందని.. ప్రియుడు ఆత్మహత్య
ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి(26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ యువతి ప్రేమించి మోసం చేసిందనే కారణంతో పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరాల ప్రకారం తెలుస్తోంది.
గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుర్రా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి.. పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని సంస్కృతి టౌన్షిప్ లో స్నేహితులతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటూ నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో శారీరకంగా దగ్గరయ్యారని సమాచారం. ప్రస్తుతం యువతి గచ్చిబౌలిలో ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఆ యువతి వద్ద వేరే వ్యక్తి ఫొటోలు, అతనితో ఉన్న ఫొటో చూసి పవన్ కళ్యాణ్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. సదరు ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు.
విషయం తెలుసుకున్న ఆమె గచ్చిబౌలి ఠాణాలో పవన్ కళ్యాణ్ రెడ్డి పై ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించక పోవడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు అతని తండ్రికి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు నగరానికి వచ్చి, ప్రేమించిన యువతి మోసగించిందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.