14 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని.. ఆపై అత్యాచారం.. భర్తకు కోర్టు ముందస్తు బెయిల్
14 ఏళ్ల బాలికను బలవంతంగా వివాహం చేసుకుని, అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల రైతుకు కొల్హాపూర్‌లోని ...
By - అంజి |
14 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని.. ఆపై అత్యాచారం.. భర్తకు కోర్టు ముందస్తు బెయిల్
14 ఏళ్ల బాలికను బలవంతంగా వివాహం చేసుకుని, అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల రైతుకు కొల్హాపూర్‌లోని బాంబే హైకోర్టు సర్క్యులర్ బెంచ్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 12న మైనర్ కేసు నమోదు చేయగా.. బాలిక తల్లిదండ్రులు బలవంతంగా ఆమె వివాహం జరిపించారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. కోర్టును ఆశ్రయించిన వ్యక్తి తరపున న్యాయవాదులు పియూష్ తోష్నివాల్, ఆకాష్ మురుద్కర్, ఆశిష్ పవార్ వాదిస్తూ.. వివాహం జరిగిన దాదాపు సంవత్సరం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన ఆ వ్యక్తి గత సంవత్సరం ఫిబ్రవరి 29న మైనర్‌ను వివాహం చేసుకున్నాడు.
ఆ అమ్మాయి తరువాత తన ప్రియుడితో పారిపోయిందని తోష్నివాల్ కోర్టుకు తెలిపారు. ఆ ప్రియుడు కూడా వివాహితుడు. ప్రియుడి భార్య ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ప్రకారం మైనర్, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత, మైనర్ తన భర్తపై బాల్య వివాహం మరియు అత్యాచారం కింద లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసే వరకు.. తన భర్తపై మైనర్ ఒక్క ఫిర్యాదు కూడా దాఖలు చేయలేదని తోష్నివాల్ వాదించారు. మైనర్, ఆమె ప్రియుడి సంబంధానికి మధ్య ఉన్న అడ్డంకిని తొలగించడానికే ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని ఆయన వాదించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిపి దేవ్కర్, నిందితుడైన భర్త మైనర్ బాలిక మామ అని ఎత్తి చూపుతూ అతనికి ఎలాంటి ఉపశమనం కల్పించడాన్ని వ్యతిరేకించారు.
"హిందూ చట్టంలోని నిబంధనల ప్రకారం, మేనకోడలితో వివాహం నిషేధించబడింది, కానీ సదరు వ్యక్తి ఆ అమ్మాయితో వివాహం చేసుకుని, ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తికి మైనర్ బాలిక వయసు తెలుసు తెలుసు. సదరు వ్యక్తిపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే, కస్టోడియల్ విచారణ అవసరం" అని దేవ్కర్ వాదించారు.
అయితే, రెండు వైపులా విన్న తర్వాత, జస్టిస్ శివకుమార్ డిగే, పోలీసులు ఆమెను అరెస్టు చేసినప్పుడు మైనర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని గమనించారు. "ఆమె సహ నిందితుడితో (ప్రియుడు) దొరికింది. భర్తపై ఫిర్యాదు చేయడంలో ఒక సంవత్సరం ఆలస్యం అయింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, మైనర్ తల్లిదండ్రులు సదరు వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆలస్యం జరిగినందున, సదరు వ్యక్తికి కస్టోడియల్ విచారణ అవసరం లేదు" అని డిగే అన్నారు.
"సహ నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. దర్యాప్తు పూర్తయింది. ఛార్జిషీట్ దాఖలు చేయబడింది" అని నిందితుడైన భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ డిగే అన్నారు.