దారుణం..అటవీ ప్రాంతంలో ఏడాది చిన్నారి మృతదేహం లభ్యం
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో సోమవారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
దారుణం..అటవీ ప్రాంతంలో ఏడాది చిన్నారి మృతదేహం లభ్యం
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో సోమవారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ సమీపంలో ఉన్న ఆర్మీ కార్గిల్స్ అటవీ ప్రాంతంలోని చెట్ల పొదల్లో ఏడాది వయసు ఉన్న బాలిక మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అటవీ ప్రాంతం గుండా వెళ్లుతున్న సమయంలో చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహాన్ని గమనించిన శివ అనే వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. బాలిక నుదుటిపై, కడుపు భాగంలో గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చిన్నారి మృతికి గల అసలు కారణాన్ని నిర్ధారించనున్నట్లు తెలిపారు. చిన్నారి సహజ మరణమా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి అక్కడికి ఎలా చేరింది, తల్లిదండ్రులు ఎవరు, కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిందా లేదా మరేదైనా ఘటన చోటుచేసుకుందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో జవహర్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.