యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి బాలిక పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందా? లేక మరో కారణం ఏమైనా ఉందని అనేది తెలియాల్సి ఉంది. బాలిక మృతి ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. మహబూబ్‌నగర్ జిల్లా విఠలపురంకు చెందిన సంధ్య అనే బాలిక యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఉన్న తూప్రాన్ పేట్ లోని మహాత్మ జ్యోతి రావు పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ... హాస్టల్‌లో ఉంటోంది.
ఈరోజు తెల్లవారుజామున పాఠశాల భవనం వెనుక వైపు సంధ్య మృతదేహం కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే హాస్టల్ అధికారులకు ఉపాధ్యాయులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న హాస్టల్ అధికారులు గురుకుల పాఠశాల భవనం నాలుగవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. బాలిక మృతి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూతురి మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.