తుపాకీ కాల్పుల్లో బీజేపీ నేత రాజు ఝా మృతి
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్‌లోని శక్తిగఢ్‌లో బీజేపీ నాయకుడు రాజు ఝాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 10:38 AM ISTబీజేపీ నాయకుడు రాజు ఝా
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్‌లోని శక్తిగఢ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు రాజు ఝాను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న సాయంత్రం కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. సీనియర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజు ఝా, తన సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళుతుండగా శక్తిగఢ్‌లోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు.
"కారులో రాజు ఝాతో సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. నిందితుడి ఉద్దేశ్యం ఇంకా తెలియరాలేదు. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని బర్ధమాన్ ఎస్పీ కమ్నాసిస్ సేన్ తెలిపారు.
West Bengal | BJP leader Raju Jha was shot dead by unidentified miscreants in Shaktigarh of Purba Bardhaman
— ANI (@ANI) April 1, 2023
It is an unfortunate incident and an investigation is being done: Kamanasish Sen, SP Purba Bardhaman pic.twitter.com/uYnrnVRZ7w
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఝా ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఝా సహచరులు కూడా గాయపడడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో ఝా శిల్పాంచల్‌లో అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ ప్రభుత్వ హయాంలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 2021 డిసెంబర్‌లో జరిగిన చివరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.