బీజేపీ నాయకుడిని కాల్చి చంపారు

BJP leader shot dead in Manipur.. prime accused surrenders. మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మంగళవారం నాడు బీజేపీ నాయకుడిని

By అంజి  Published on  25 Jan 2023 4:16 AM GMT
బీజేపీ నాయకుడిని కాల్చి చంపారు

మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మంగళవారం నాడు బీజేపీ నాయకుడిని కాల్చి చంపారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరొక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగం మాజీ సైనికోద్యోగుల విభాగం కన్వీనర్ లైష్రామ్ రామేశ్వర్ సింగ్, క్షేత్ర లైకై ప్రాంతంలోని ఆయన నివాసం గేట్ల దగ్గర ఉదయం హత్యకు గురయ్యారని తౌబల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హౌబీజం జోగేశ్‌చంద్ర తెలిపారు.

రిజిస్ట్రేషన్ నంబర్ లేని కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉదయం 11 గంటల సమయంలో రామేశ్వర్‌ సింగ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని చెప్పారు. 50 ఏళ్ల సింగ్‌ ఛాతీపై బుల్లెట్ గాయమైంది. అతన్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత వాహనం నడుపుతున్న నౌరెమ్ రికీ పాయింటింగ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు జోగేశ్‌చంద్ర తెలిపారు. బిష్ణుపూర్ జిల్లాలోని కీనౌకు చెందిన డ్రైవర్‌ను ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని హౌబామ్ మరాక్ ప్రాంతంలో పట్టుకున్నారు.

46 ఏళ్ల అయెక్‌పామ్ కేశోర్జిత్‌గా గుర్తించబడిన ప్రధాన నిందితుడి కోసం పోలీసులు భారీ వేటను ప్రారంభించారు. అతనికి ఆశ్రయం కల్పించకుండా ప్రజలను హెచ్చరిస్తూనే లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కమాండో కాంప్లెక్స్‌లో పోలీసుల ముందు లొంగిపోయాడు. అతను హౌబామ్ మరాక్‌కు చెందినవాడు. అతని వద్ద నుంచి .32 క్యాలిబర్ లైసెన్స్‌డ్ పిస్టల్, రెండు మ్యాగజైన్‌లు, తొమ్మిది కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఘటనా స్థలంలో 32 క్యాలిబర్ బుల్లెట్ ఖాళీ కేసును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నౌరెమ్ రికీ పాయింటింగ్ సింగ్ వాహనం నడుపుతుండగా, అయెక్పామ్ కేశోర్జిత్ బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిపాడని ఎస్పీ తెలిపారు. హత్య వెనుక గల కారణాలపై ప్రశ్నించగా తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు చిదానంద సింగ్‌ డిమాండ్ చేశారు.

Next Story