రన్యా రావు స్మగ్లింగ్‌ కేసు: కీలక నిందితుడు అరెస్టు

హీరోయిన్‌ రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌ అయ్యాడు.

By అంజి
Published on : 27 March 2025 2:21 PM IST

Ranya Rao case, Gold deale, smuggling, arrest

రన్యా రావు స్మగ్లింగ్‌ కేసు: కీలక నిందితుడు అరెస్టు

హీరోయిన్‌ రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌ అయ్యాడు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI).. హై ప్రొఫైల్ రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో కీలక పాత్రధారి సాహిల్ జైన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసులో జైన్ మూడవ నిందితుడు (A3), స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో "కీలక వ్యక్తి" అని అధికారులు తెలిపారు.

డీఆర్‌ఐ ప్రకారం.. జనవరి 11, 2025న నటి రన్యా రావు దేశంలోకి తీసుకువచ్చిన 14.568 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి జైన్ ప్రోత్సహించాడు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 11,55,97,000, దీని వలన దాదాపు రూ. 4,46,61,919 కస్టమ్స్ సుంకం నష్టం వాటిల్లింది.

అక్రమంగా తరలించిన బంగారం విషయంలో జైన్ గతంలో రెండు సార్లు రన్యా రావుకు సహాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మార్చి 3న రన్యా నుండి స్వాధీనం చేసుకున్న 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేయడానికి సిద్ధమైనట్లు డీఆర్‌ఐకి ఆధారాలు లభించాయి. సాహిల్ జైన్‌ను శనివారం వరకు డిఆర్‌ఐ కస్టడీకి తరలించారు.

మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావును అరెస్టు చేశారు. ఆమె నడుము చుట్టూ బ్యాండేజీలు, టిష్యూలతో చుట్టబడిన బంగారు కడ్డీలు బయటపడ్డాయి. అంతేకాకుండా.. ఆమె బూట్లు, ముందు జేబుల్లో అదనపు బంగారు కడ్డీలు కూడా కనిపించాయి.

స్వాధీనం చేసుకున్న బంగారం 24 క్యారెట్లు, 14.2 కిలోల బరువు కలిగి ఉంది, దీని విలువ రూ. 12.56 కోట్లకు పైగా ఉంటుంది. రన్యా రావుపై కస్టమ్స్ చట్టం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. డిజిపి రామచంద్రరావు ఇచ్చిన నిర్దిష్ట సూచనల మేరకు తాను అలా చేశానని నటికి సహాయం చేసిన ప్రోటోకాల్ అధికారి దర్యాప్తు అధికారులకు తెలిపారు. బంగారం అక్రమ రవాణా కేసుపై తీవ్ర నిరసనలు చెలరేగడంతో రన్యా సవతి తండ్రి రామచంద్రరావును ఇటీవల తప్పనిసరి సెలవుపై పంపారు.

Next Story