తండ్రిని చంపేందుకు.. రూ.కోటి కాంట్రాక్ట్ కిల్లర్లకు ఇచ్చిన కొడుకు
బెంగళూరులో 71 ఏళ్ల వృద్ధుడి హత్య కేసును ఛేదించినట్లు కర్ణాటక పోలీసులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 28 Feb 2023 5:15 PM ISTప్రతీకాత్మక చిత్రం
బెంగళూరులో 71 ఏళ్ల వృద్ధుడి హత్య కేసును ఛేదించినట్లు కర్ణాటక పోలీసులు మంగళవారం తెలిపారు. బాధితుడి కుమారుడు మణికంఠ (30) కోటి రూపాయలు చెల్లించి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు విచారణలో తేలింది. నేరానికి సంబంధించి అతని కొడుకు, మరో ఇద్దరు నిందితులను టి.ఆదర్శ (26), శివకుమార్ (24)గా గుర్తించారు. బాధితుడు నారాయణస్వామిని ఫిబ్రవరి 13న తన అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్ స్థలంలో నరికి చంపారు. ఈ కేసులో ఇతరుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడైన తండ్రి.. మణికంఠ రెండో భార్యపై ఆసక్తి చూపడంతో పాటు అతని ఆస్తిని ఆమె పేరు మీద రిజిస్టర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2013లో మణికంఠ తన మొదటి భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో జైలు పాలయ్యాడు. రెండో భార్యను హతమార్చేందుకు ప్రయత్నించి మళ్లీ రెండోసారి జైలు పాలయ్యాడు.
అతను రెండవసారి జైలులో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ కిల్లర్లను కలుసుకున్నాడు. తన తండ్రిని చంపితే కోటి రూపాయలు, ఒక అపార్ట్మెంట్ ఇస్తానని హామీ ఇచ్చాడు. మణికంఠ అడ్వాన్స్‌గా రూ.లక్ష కూడా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. నారాయణస్వామికి బెంగళూరులో 28 ఫ్లాట్లతో పాటు ఎకరాల భూమి కూడా ఉంది. అందులో ఒక ఫ్లాట్, 1.7 ఎకరాల భూమి, రూ.15 లక్షల నగదును మణికంఠ రెండో భార్య పేరున రిజిస్టర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కేసును మారతహళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.