విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య.. మృతదేహాలతో ఐదు రోజులు గడిపిన బాలిక
Bengaluru Five of family including 9 month old boy found dead.కారణాలు ఏవైనప్పటికి ఆ ఇంట్లోని నలుగురు పెద్దలు
By తోట వంశీ కుమార్ Published on 18 Sept 2021 12:35 PM ISTకారణాలు ఏవైనప్పటికి ఆ ఇంట్లోని నలుగురు పెద్దలు ఓకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులను విధికి వదిలివేశారు. ఎవరూ గమనించకపోవడంతో.. ఆకలితో అలమటించి 9 నెలల చిన్నారి ప్రాణం కోల్పోగా.. రెండేళ్ల పాప నాలుగు మృతదేహాల మధ్య ఐదు రోజుల పాటు అలాగే ఉండిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. తిగళరపాళ్య చేతన్ ఏరియాలో శంకర్, భారతి(50) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారైలు సించన(33), సింధురాణి(30), ఓ కుమారుడు మధుసాగర్(27) సంతానం. ఇద్దరు కుమారైలకు వివాహాలు అయ్యాయి. కాగా.. సించన రెండో కాన్పు కోసం కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు 2ఏళ్ల వయసు ఉన్న కూతురు ఉంది. అయితే.. బాబు జన్మించి 9 నెలలు దాటినప్పటికి కూడా సించన అత్తవారింటికి వెళ్లలేదు. అత్తవారింటికి వెళ్లాలని తండ్రి శంకర్.. సించనను గత కొద్దిరోజులుగా కోరుతున్నాడు. అత్తమామలతో సమస్యలు ఉన్నాయని, కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని ఆమె చెప్పింది. దీనిపై కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయి.
తన మాట ఎవరు వినడం లేదని ఆగ్రహించిన తండ్రి శంకర్ ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. ఇంటికి ఫోన్ చేస్తున్నప్పటికి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఫోన్ ఎత్తడం లేదు. దీంతో అనుమానం వచ్చి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాడు. తలుపులు పగల కొట్టి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి నిశ్చేష్టులయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
నలుగురు కుటుంబ సభ్యులు ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉరివేసుకోగా.. మధుసాగర్ ఉరివేసుకున్న గదిలో రెండేళ్ల చిన్నారి అపస్మారక స్థితిలో కనిపించింది. 9 నెలల చిన్నారి ఆకలితో చనిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల క్రితమే వారు ఉరివేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇది ఆత్మహత్యగానే కనిపిస్తున్నప్పటికి పోస్టుమార్టం నివేదికతో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.