ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిని నాలుగో అంతస్తు పై నుంచి విసిరేసిన తల్లి
Bengaluru Dentist Throws Daughter Off 4th Floor.ఈ లోకంలో తల్లి ప్రేమను మించింది మరేది లేదంటారు. బిడ్డకు చిన్న
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2022 5:37 AM ISTఈ లోకంలో తల్లి ప్రేమను మించింది మరేది లేదంటారు. బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతుంది అమ్మ. తనకు ఏమనా ఫర్వాలేదు తన బిడ్డకు ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అయితే ఇటీవల కొందరు అమ్మ తనానికే మాయని మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి కుమార్తై అడ్డుగా ఉందని ఆ చిన్నారిని చంపేసిన ఘటనను మరువక ముందే మరో మహిళ తన నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు పై నుంచి కిందకు విసిరేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని ఎస్ఆర్‌నగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో జంట నివసిస్తోంది. భర్త సాప్ట్‌వేర్ ఇంజినీరు కాగా భార్య దంతవైద్యులు. వీరికి నాలుగేళ్ల కుమారై ఉంది. అయితే.. ఆ పాప మాట్లాడలేదు, చెవులు కూడా వినపడవు. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్థాపం చెందింది.
తమ అపార్ట్‌మెంట్ ముందు బిడ్డతో కలిసి నిలబడి ఉన్న ఆ మహిళ.. కాసేపు అలా చూసి, చేతుల్లోని బిడ్డను ఎత్తి కిందకు విసిరేసింది. అనంతరం ఆమె సైతం రెయిలింగ్ ఎక్కి కొద్ది సేపు అలాగే నిలబడింది. అది చూసి అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి ఆమెను వెనక్కు లాగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తీవ్రగాయాలతో బాలిక మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఆ మహిళ మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.