ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి.. జీర్ణించుకోలేక వ్యక్తి ఆత్మహత్య
పశ్చిమ బెంగాల్‌లో 23 ఏళ్ల యువకుడు ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 21 Nov 2023 2:45 AM GMTప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి.. వ్యక్తి ఆత్మహత్య
పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో 23 ఏళ్ల యువకుడు ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బంకురాలోని బెలిటోర్ సినిమా హాల్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'క్రికెట్ ప్రేమికుడు ' అని కూడా పిలువబడే రాహుల్ లోహర్ అనే వ్యక్తి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు సెలవు తీసుకున్నాడు. చివరి గేమ్‌లో భారత్ ఓడిపోవడంతో అతను తన గదిలో ఉరివేసుకుని జీవితాన్ని ముగించుకున్నాడు.
ఈ ఘటనపై లోహర్ అల్లుడు బాబు ఉత్తమ్ సూర్ మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని తట్టుకోలేక రాహుల్ ఇంట్లో మెడకు చుట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని ఆయన తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లోహర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై బంకురా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ దోర్జీ మాట్లాడుతూ.. విచారణ పూర్తయ్యే వరకు ఈ విషయంపై ఏమీ చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందని, మరోవైపు అసహజ మరణం కింద కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన CWC 2023 ఫైనల్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో టోర్నమెంట్‌లో ఆతిథ్య జట్టు పరాజయం పాలైంది. ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియన్లు కేవలం 43 ఓవర్లలో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు.