బాపట్ల జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచింగ్
బాపట్ల జిల్లా చీరాలలోని రామకృష్ణాపురంలో దారుణం చోటు చేసకుంది.
By Srikanth Gundamalla Published on 20 July 2024 3:15 PM ISTబాపట్ల జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచింగ్
బాపట్ల జిల్లా చీరాలలోని రామకృష్ణాపురంలో దారుణం చోటు చేసకుంది. ఓ దుండగుడు పట్టపగలే చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఓ వ్యక్తి గొలుసును లాక్కెళ్లాడు. సీసీ కెమెరాలో ఈ చైన్‌స్నాచింగ్‌కి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ముందుగా రామకృష్ణాపురంలోని కాలనీలోకి బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి హేమలత అనే మహిళను ఫాలో అయ్యాడు. ఎవరూ లేని సమయం చూసుకున్నాడు. మహిళను దాటి ముందుకు వెళ్లి ఎవరూ రావడం లేదని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి.. హేమలత వద్ద బైక్‌ను నిలిపాడు. ఆమె దగ్గరకు వెళ్తూ... ఏదో అడ్రస్ అడుగుతున్నట్లుగా నటించాడు. అప్పటికే కాస్త కంగారు పడిన మహిళ వెనకడుగు వేస్తూనే మాట్లాడింది.
ఇక చైన్ స్నాచర్ ఒక్కసారిగా ఆమె మెడ నుంచి గొలుసును లాగాడు. ఆ సంఘటనతో అప్రమత్తం అయిన హేమలత.. గొలుసు తెగకుండా పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ.. ఒకటికి రెండు సార్లు చైన్ స్నాచర్ గొలుసును లాగాడు. ఆ తర్వాత చైన్ చేతికి చిక్కడంతో బైక్ తీసి అక్కడి నుంచి పరారయ్యాడు. హేమలత అరుపులతో స్థానికంగా ఉన్నవారు బయటకు వచ్చారు. ఏమైందంటూ ఆరా తీశారు. ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చివరకు బాధితురాలు హేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.