బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య.. అతడు ఇచ్చిన రుణాలే ఉసురు తీశాయి
Bank manager commits suicide unable to recover loans.అతడో బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 12 Oct 2022 9:20 AM ISTఅతడో బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో వ్యక్తిగతంగా ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే.. బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు(లోన్స్) రికవరీ కాకపోవడంతో పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో అప్పు చేసి మరీ ఖాతాదారుల అప్పులు చెల్లించాడు. చేసిన అప్పులు పెరిగిపోతుండడంతో మనోవ్యథకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యానాంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాంత్(33) యానాంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం భార్య గాయత్రి ఇద్దరు పిల్లలను పాఠశాలలో దించేందుకు వెళ్లింది. పిలలను స్కూల్‌లో దించి తిరిగి ఇంటికి వచ్చిన గాయత్రి తలుపును ఎన్నిసార్లు కొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా.. శ్రీకాంత్ ఫ్యాన్‌కు ఉరేకుని కనిపించాడు. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలకొట్టి ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
యానాంకు రాక ముందు శ్రీకాంత్ మచిలీపట్నంలోని బ్రాంచ్‌లో మేనేజర్‌గా పని చేశాడు. పలువురికి రుణాలు మంజూరు చేశాడు. రుణాలు తీసుకున్నవారిలో కొందరు చెల్లించలేదు. ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో రూ.60లక్షలు అప్పు చేసి మరీ ఆ రుణాలను చెల్లించాడు. అనంతరం యానాంకు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చాడు. ఇక్కడ కూడా మరో రూ.40లక్షల వరకు అప్పులు చేశాడని పోలీసులు తెలిపారు..
విధి నిర్వహణ సమస్యలతో తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైయ్యాడని భార్య గాయత్రి తెలిపింది. త్వరలోనే అప్పులు మొత్తం తీరిపోతాయని సోమవారం రాత్రి ఎంతో సంతోషంగా చెప్పాడని, ఇంతలో ఇంత ఘోరం జరిగిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పింది.