హైదరాబాద్ నగరంలోని ఓ బేకరీలో భారీగా నగదును చోరి చేసిన నిందితులు ఎంచక్కా విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి బస్సులో కోల్‌కత్తాకు బయలుదేరారు. విషయం తెలిసిన పోలీసులు వారికంటే ముందుగా విమానంలో వెళ్లి.. నిందితులను బస్సులో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 18న జూబ్లీహిల్స్ పరిధిలోని వాక్స్ బేకరీలో రూ.7లక్షల నగదు చోరీ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన బేకరి యజమాని అమర్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సోహిదుల్ అస్లాం(23) మీద అనుమానాన్ని వ్యక్తం చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను కుణ్ణంగా పరిశీలించగా.. గతంలో ఇదే బేకరీలో పనిచేసిన అస్సాంవాసి అలీముద్దీన్ షేక్(23), అతని సోదరుడు అక్సుదుల్ అలీ(19)లతో కలిసి సోహిదుల్ ఈ చోరి చేసినట్లు గుర్తించారు. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయగా.. ముగ్గురు విజయవాడు చేరుకుని అక్కడి నుంచి బస్సులో కోల్‌కత్తాక బయలుదేరినట్లు గుర్తించారు. ఆ వెంటనే పోలీసులు.. విమానంలో కోల్‌కతాకు వెళ్లారు. పశ్చిమ బెంగాల్ పోలీసులకు విషయం చెప్పి.. వారు ప్రయాణిస్తున్న మార్గం వివరాలను తెలిపారు. కోల్ కతాలో దిగిన జూబ్లీహిల్స్ స్పెషల్ టీమ్ బృందం.. నిందితులు బస్సులో ఉండగానే గుర్తించి, అరెస్ట్ చేశారు. వారు దొంగిలించిన సొత్తులో రూ. 6.43 లక్షలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.