అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కోరారు.
నరేశ్‌పై ఇప్పటికే 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ ష్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నరేశ్ వీడియోలు పోస్ట్ చేయగా.. సోషల్ మీడియా ద్వారా అతడిని ట్రేస్ చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. నరేశ్ వ్యాఖ్యల పట్ల అయ్యప్ప స్వాములు భగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్త పలు చోట్ల అయ్యప్పస్వాములు ఆందోళనలు చేపట్టారు. హిందూవాహిని, అయ్యప్ప మాలధారణ సభ్యులు అతడిపై కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడే కాక పలు చోట్ల అతడిపై కేసులు నమోదు అయ్యాయి.