ప్రస్తుత కాలంలో యువత క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో, ప్రేమించిన వారు దూరం అయ్యారనో, ఫ్రెండ్స్ ఏడిపించారనో.. ఇలా చిన్న చిన్న కారణాలకే తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా కన్నవారికి కడుపుకోతనే మిగులుస్తున్నారు. తాజాగా సెల్‌ఫోన్ ఎక్కువగా మాట్లాడ వద్దని తల్లి మందలించగా.. బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం పామెన గ్రామంలో శివశంకర్, పుష్పలత దంపతులు తమ కుమారై సుప్రియ(18) తో కలిసి నివాసం ఉంటున్నారు. సుప్రీయ.. మెయినాబాద్ మండలంలోని గ్లోబల్ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. కాగా.. ఇటీవల సుప్రియ సెల్‌ఫోన్ ఎక్కువగా మాట్లాడోంది. ఈ విషయం గమనించిన తల్లి పుష్ప లత బుధవారం సుప్రియను మందలించింది. దీంతో సుప్రియ తీవ్ర మనస్థాపానికి గురైంది.
కుమార్తె అలిగి ఉంటుందనీ.. కొద్ది సేపటి తర్వాత మామూలుగా అయిపోతుందని పుష్పలత బావించి తన పనిలో నిమగ్నమైంది. కొద్దిసేపటి తరువాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సుప్రియ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పుష్పలత లోపలికి వెళ్లి చూసింది. అక్కడ సుప్రియ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. అది చూసిన ఆమె తల్లి కేకలు వేయగా.. ఇరుగుపొరుగు వారు అక్కడకు వచ్చి చూడగా.. సుప్రియ అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.