హైదరాబాద్: పోలీస్, న్యూస్ రిపోర్టర్‌గా నటిస్తూ నగరంలో మసాజ్ పార్లర్‌లో దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు నిందితులు 29 ఏళ్ల మునావర్ హసన్ ఖాన్, 23 ఏళ్ల గఫార్ అలీ ఖాన్, 33 ఏళ్ల సయ్యద్ అబ్దుల్ రాఫ్ స్నేహితులు. వీరూ గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే దొంగదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నారు.
ముగ్గురు స్నేహితులు త్వరగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. వారి ప్లాన్ ప్రకారం.. మునావర్ షేక్‌పేట్ టాస్క్ ఫోర్స్ నుండి అధికారిగా, గఫార్ 'కరెంట్ న్యూస్ ఛానెల్' నుండి న్యూస్ రిపోర్టర్‌గా నటిస్తూ షేక్‌పేట ఓయూ కాలనీలోని స్టార్ స్పా అండ్ సెలూన్ అనే మసాజ్ పార్లర్‌లోకి ప్రవేశించారు. మునవర్ నేవీ బ్లూ సఫారీ డ్రెస్‌లో ఉండగా, గఫార్ వద్ద నకిలీ మీడియా ఐడీ కార్డు ఉంది. చిత్రీకరణ ప్రారంభించి.. రూ. 20,000/- ఇవ్వాలని పార్లర్ ఉద్యోగులను బెదిరించారు. ఇంతలో సయ్యద్ అబ్దుల్ రవూఫ్ ఆ ప్రదేశానికి కాపలాగా నిలబడి, ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు.
అయితే, ఆ ముగ్గురిని అసలు పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. వారి నుంచి నేవీ బ్లూ సఫారీ డ్రెస్, నకిలీ మీడియా కార్డును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదైంది. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.