Hyderabad: డబ్బుల కోసం యాచకులపై దాడి.. ఒకరు మృతి
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 10:19 AM ISTHyderabad: డబ్బుల కోసం యాచకులపై దాడి.. ఒకరు మృతి
డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. రోడ్లపై వెళ్తున్న మహిళల నుంచి బంగారం గొలుసులను లాక్కెళ్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో సుదరు బాధిత మహిళలకు తీవ్ర గాయాలు అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకొన్ని చోట్ల డబ్బులు, ఆస్తుల కోసం సొంత వారినే చంపేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కూడా అదే డబ్బు కోసం కొందరు దుండగులు యాచకులను టార్గెట్‌గా చేసుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి వారిపై దాడులు చేసి డబ్బులను ఎత్తుకెళ్లారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు యాచకులు రోడ్డుపై వెళ్తున్న వారిని అడుక్కుని అక్కడే నిద్ర పోతుంటారు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఇద్దరు యాచకులు రోడ్డు పక్కనే పడుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి ఆ ఇద్దరు యాచకులపై దాడికి తెగబడ్డారు. వారిలో ఒక యాచకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కూడా హత్య చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. అంతకుముందే వారి వద్ద ఉన్న డబ్బులను మొత్తం లాక్కున్నారని సదురు బాధిత యాచకులు వెల్లడించారు.
ఇక కాసేపటికే యాచకుడు హత్యకు గురైన విషయాన్ని స్థానికులు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యాచకుడి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో యాచకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. యాచకులపై ముగ్గురు కత్తులతో దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. సికింద్రాబాద్‌లో డబ్బుల కోసం యాచకులను చంపిన ఈ సంఘటన కలకలం రేపుతోంది.