రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని కొందరు దుండగులు ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వేములవాడ మండల పరిధిలోని నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. అతని శరీరంపై విచక్షణా రహితంగా కత్తులతో పొడుస్తూ దారుణంగా చంపారు. వేములవాడ పట్టణంలోని కోనయ్యపల్లి రహదారిలో గల హోండా యాక్టివా షోరూం పక్కన వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తలతోపాటు దాదాపు 20 చోట్ల మృతునిపై కత్తితో దాడి చేసిన గాట్లు ఉన్నాయి. రక్తపు మడుగులో పడిన యువకుని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకుడి మరణ వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మృతునికి భార్య సిరిన్, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుడు గంగాధర లో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. యువకుడిని ఎందుకు హత్య చేశారు? పాత కక్షలు ఎవైనా ఉన్నాయా? లేక మరే కారణాల వల్లనైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.