కరీంనగర్‌లో దారుణం.. తల లేని చిన్నారి మృతదేహం లభ్యం

కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని లక్ష్మీ నగర్‌లో తల లేని ఓ చిన్నారి పాప మృతదేహం లభ్యమైంది.

By అంజి  Published on  3 Aug 2023 8:15 AM GMT
Karimnagar, Crime news, Lakshimi Nagar

కరీంనగర్‌లో దారుణం.. తల లేని చిన్నారి మృతదేహం లభ్యం

కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని లక్ష్మీ నగర్‌లో తల లేని ఓ చిన్నారి పాప మృతదేహం లభ్యమైంది. ఇది చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాన్ని.. ఇటీవల శ్రీహరి నగర్‌లో అదృశ్యమైన పాప క్రతిక మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించి, అనంతరం పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

మధ్యప్రదేశ్‌లోని బాలకట్‌కు చెందిన కావేరీ యశ్వంత్, సవిత దంపతులు.. వీరికీ క్రతిక(3)అనే కూతురు ఉంది. యశ్వంత్ మధ్యప్రదేశ్ నుండి ఉపాధి నిమిత్తం కరీంనగర్‌కు వచ్చి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గత మూడు రోజుల క్రితం ఇంటిముందు ఆడుకుంటున్న క్రతిక అదృశ్యమైంది. పాప కనిపించక పోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా కూడా పాప గురించి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈరోజు లక్ష్మీ నగర్ లో తల లేని చిన్నారి మృతదేహం లభ్యమయింది. పాప క్రతిక మృతదేహంగా తల్లిదండ్రులు గుర్తించారు. పాప మృతి చెందడంతో బంధువులు, తల్లిదండ్రులు హాస్పిటల్ వద్ద గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story