Eluru: నిర్లక్ష్యం చేస్తోందని ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య
నిర్లక్ష్యం చేస్తోందని, అవమానానికి గురి చేస్తోందని ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ ఘటన ఏలూరు నగరంలో జరిగింది.
By అంజి Published on 29 Aug 2023 9:30 AM ISTEluru: నిర్లక్ష్యం చేస్తోందని ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య
నిర్లక్ష్యం చేస్తోందని, అవమానానికి గురి చేస్తోందని ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారని భయపడి రైలు కిందపడి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు నగరంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు దక్షిణపు వీధి అశోక్ చక్రం ప్రాంతానికి చెందిన ఇంట్లో ఓ మహిళ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలిని శనివారపుపేటకు చెందిన ఉడతా సుజాత (30)గా గుర్తించారు. అయితే ఆమె మృతి చెందిన ఇంట్లో దిమ్మిటి సత్యనారాయణ(40) నివాసముంటున్నాడు. అతనికి పెళ్లై భార్యతో విభేదాలు రావడంతో 5 ఏళ్ల కిందట వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు.
హత్యకు గురైన సుజాత నాలుగేళ్లుగా అతనితో సన్నిహితంగా ఉంటోందని, అప్పుడప్పుడూ వచ్చివెళ్తుందని స్థానికులు కొందరు పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి ఇంటికొచ్చిన సుజాతను సత్యనారాయణ కత్తితో పీక కోసి చంపాడు. ఆ మరునాడు ఉదయం ఇంటికి తాళం వేసి బైక్‌పై బయటకు వెళ్లాడు. పోలీసులకు దొరికిపోతానేమోనని భయపడి.. నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అతని జేబులో ఓ చీటీపై పేరు, చిరునామా ఉండటంతో వివరాలు తెలుసుకున్నారు.
అలాగే బైక్‌ని, అతని జేబులో ఉన్న ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యమైంది. సుజాత తనను దూరం పెడుతోందని, ఇది వరకు బాగానే ఉండేదని.. ఆమెకు తాళి కూడా కట్టానని సత్యనారాయణ సూసైడ్ నోట్‌లో రాశాడు. కొద్ది రోజులుగా అవమానిస్తోందని, అందుకే ఆదివారం రాత్రి నమ్మకంగా ఇంటికి పిలిపించుకుని ఈ విధంగా చేశానని పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న సత్యనారాయణ అతని నివాసానికి వెళ్లిచూశారు. లోపల సుజాత మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు పగులకొట్టిన పోలీసులు లోపల రక్తపు మడుగులో ఉన్న సుజాత మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.