ఢిల్లీలో దారుణం.. యువతిని కొట్టి బలవంతంగా కారులో కిడ్నాప్‌.. వీడియో

ఢిల్లీలోని ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  19 March 2023 11:48 AM IST
Delhi,  Haryana, kidnapping

ఢిల్లీలో దారుణం.. యువతిని కొట్టి బలవంతంగా కారులో కిడ్నాప్‌

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఔటర్ ఢిల్లీలోని మంగోల్‌పురిలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయిని ఈడ్చుకెళ్లి తమ కారులోకి నెట్టడం కనిపించింది. కారు హర్యానా నంబర్ ప్లేట్ కలిగి ఉంది. అది ప్రైవేట్ క్యాబ్ అని పోలీసులు తెలిపారు. ఓ బాటసారుడు దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు.

శనివారం రాత్రి ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని, దీన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని ఔటర్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) హరేందర్ కుమార్ సింగ్ తెలిపారు. వాహనం డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకులు, ఓ యువతి రోహిణి నుండి వికాస్పురికి ఉబర్ ట్రాన్స్‌పోర్టులో క్యాబ్‌ బుక్ చేశారు. ''మార్గమధ్యంలో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆ అబ్బాయి అమ్మాయిని బలవంతంగా కారులోకి తోస్తున్నట్లు వీడియోలో ఉంది. గొడవ జరిగిన తర్వాత ఆ అమ్మాయి బయటకు వెళ్లాలనుకున్నది'' అని పోలీసులు తెలిపారు.

తదుపరి విచారణ పురోగతిలో ఉంది. కేసును విచారించేందుకు పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేశారు. క్యాబ్ యజమాని గురుగ్రామ్ నివాసిగా గుర్తించి అక్కడికి ఒక బృందాన్ని పంపారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు. శనివారం రాత్రి 11.30 గంటలకు గురుగ్రామ్ లోని ఇఫ్కో చౌక్ లో క్యాబ్ చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story