తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.
By Knakam Karthik
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ గురుకులాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. బైపీసీ చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోష్ (16) కళాశాల గ్రౌండ్ లో ఉన్న చెట్టుకు శనివారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అరెపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ వేల్పూర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో స్థల సేకరణ సమస్యతో ఈ కళాశాలను ఆర్మూర్‌లోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలోనే కొనసాగిస్తున్నారు. ఈ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సంతోష్ ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు.
సంతోష్ ఉదయం ఆరున్నర వరకు కళాశాల గ్రౌండ్ లోనే వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ లను పూర్తిచేశాడు. గ్రౌండ్ నుంచి ఫ్రెషప్ కావడానికి తిరిగి తమ గదిలోకి వెళ్లిన సంతోష్ టవల్ తీసుకొని వెనుక వైపు ఉన్న కాంపౌండ్ వాల్ దూకి బయటకు వెళ్లినట్లు సమాచారం. అతను హాస్టల్‌కి రాకపోవడంతో, అతని స్నేహితులు వెతకడం ప్రారంభించారు మరియు చివరికి అతను కళాశాల ఆవరణ వెలుపల ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. సమీపంలోనే ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గమనించి సమాచారం ఇవ్వడంతో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.