కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో నీట్ విద్యార్థి సూసైడ్
కోటాలో కొన్నాళ్లుగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 4:59 AM GMTకోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో నీట్ విద్యార్థి సూసైడ్
రాజస్థాన్‌లోని కోచింగ్ సెంటర్ హబ్‌గా కోటా పేరుపొందింది. అయితే.. ఇక్కడ కొన్నాళ్లుగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. అధికారులు విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితాలు మాత్రం శూన్యం అవుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కోటాలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్థాంతరంగా తనవు చాలించాడు. ఇప్పటికే కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28కి చేరుకుంది.
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఫరీద్ హుస్సేన్ కోటాకు వచ్చాడు. వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్ పరీక్షకు ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే.. వక్ఫ్ నగర్ ప్రాంతంలో పలువురు విద్యార్థులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం తిరిగి ఇతర రూమ్‌మేట్స్ గది దగ్గరకు వచ్చారు. గది తలుపులు లోపల గడియ పెట్టి ఉంది. డోర్ కొట్టారు.. కానీ హుస్సేన్ డోర్ ఓపెన్ చేయలేదు. పడుకుని ఉంటాడని ఫోన్ చేశారు. కానీ.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. దాంతో.. అనుమానం వచ్చిన ఆ విద్యార్థులు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దాంతో వెంటనే అతన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే ఫరీద్ హుస్సేన్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.
ఇక విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రికి వెళ్లి ఫరీద్ హుస్సేన్ రూమ్‌మేట్స్ నుంచి సమాచారం సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థి మృతిపై అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అతని మరణానికి గల కారణాలను విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా.. వివిధ పోటీ పరీక్షల కోచింగ్ కోసం ప్రసిద్ధి చెందిన కోటాకు చాలా మంది విద్యార్థులు వస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడికే వస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం సృష్టిస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే గతంతో పోలిస్తే ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి. 2023 ఏడాదిలో 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హాస్టళ్లు, భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమరుస్తున్నారు. భవనాలపై నుంచి దికాన ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కింది ఆవరణల్లో వలలు కడుతున్నారు.