విషాదం.. మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నారాయణ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ విద్యార్థి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
By అంజి Published on 3 Dec 2024 7:28 AM ISTవిషాదం.. మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
తమ పిల్లలు డాక్టరు లేక సాఫ్ట్వేర్ ఇంజనీరు అవ్వాలని ఆశపడుతూ చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించి వారి భవి ష్యత్తును అంధకారం చేస్తున్నారు. వారి పిల్లల్ని వారే చేజేతులా కోల్పోతున్నారు.. ఇప్పటికే హైదరాబాద్ మహా నగరంలో పలు చోట్ల ఉన్న నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయినా కూడా తల్లి దండ్రుల్లో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా నారాయణ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
కుషాయిగూడకి చెందిన తనుష్(16)అనే విద్యార్థి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనోజిగూడలో ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపులు భరించలేక తనుష్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. బాత్రూంలో ఉరి వేసుకుని తనుష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది గమనించిన విద్యార్థులు వెంటనే కాలేజీ యజమాన్యానికి సమాచారాన్ని అందించారు.
కాలేజీ సిబ్బంది హుటాహుటిన తనుష్ ని, స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా, పరీక్షించిన వైద్యులు తనుష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. తనుష్ మృతి చెందినట్లుగా అతని తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారాన్ని అందించింది. లెక్చరర్ వేధింపులే విద్యార్థి మృతికి కారణమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తున్నారు.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.