దారుణం.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి హత్య

బెంగళూరులో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లకు ఆహారంలో విషం పెట్టి హత్య చేశాడు.

By అంజి  Published on  3 March 2023 12:01 PM IST
Bengaluru, Crime news, Alcoholic man

మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి హత్య (ప్రతీకాత్మక చిత్రం)

బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లకు ఆహారంలో విషం పెట్టి హత్య చేశాడు. మృతులను విజయలక్ష్మి (28), నిషా (7), దీక్ష (5)గా గుర్తించారు. కేన్సర్‌తో బాధపడుతూ డిప్రెషన్‌లో ఉన్న భర్త నాగేంద్ర కూడా మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కానీ అతను రక్షించబడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేంద్రకు క్యాన్సర్‌ రావడంతో ఇంటి నిర్వహణ బాధ్యతను అతని భార్య విజయలక్ష్మి తీసుకుంది.

కొన్నాళ్లుగా నాగేంద్ర కూడా మద్యానికి బానిసయ్యాడు. నాగేంద్ర నిత్యం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా భార్య విజయలక్ష్మితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే గొడవ అనంతరం ఆవేశంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆహారంలో విషం కలిపి భార్య, ఇద్దరు కూతుళ్లకు వడ్డించడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఉదయం విజయలక్ష్మి సోదరుడు వారి ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story