దారుణం.. ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేతను కాల్చి చంపిన ఘటన బీహార్‌లోని సివాన్‌లో వెలుగుచూసింది.
By అంజి Published on 24 Dec 2023 8:00 AM IST
దారుణం.. ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేతను కాల్చి చంపిన ఘటన బీహార్‌లోని సివాన్‌లో వెలుగుచూసింది. ఏఐఎంఐఎం నాయకుడు ఆరిఫ్ జమాల్ (వయస్సు 40 సంవత్సరాలు)ను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కాల్పులు జరిగిన తరువాత, నాయకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి, దానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆరిఫ్ జమాల్ సివాన్‌లోని ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అతను ఒక రెస్టారెంట్ యజమాని కూడా.
హుస్సేన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతుబ్ ఛప్రాలో ఉన్న ఆయన సొంత రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు బైక్‌పై అక్కడికి చేరుకుని ఆరిఫ్ జమాల్‌ను కాల్చిచంపారు. జమాల్‌పై మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన రాత్రి 8.30 నుంచి 9 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కాల్పుల అనంతరం బైక్‌పై వెళ్తున్న దుండగులు పారిపోయారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హుస్సేన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి చేరుకున్నారని ఆయన చెప్పారు. కాల్పులు జరగడంతో ఆరిఫ్‌ను ఆస్పత్రికి తరలించారు.
దీంతో వైద్యులు అతడిని పాట్నాకు రెఫర్ చేశారు. దీని తరువాత అతను మరణించాడు. గతంలో కూడా ఏఐఎంఐఎం నేత హత్యకు గురయ్యారు. 2021 సంవత్సరం ప్రారంభంలో హైదరాబాద్‌లో పట్టపగలు రద్దీగా ఉండే రహదారిపై ఏఐఎంఐఎం నేత అసద్ ఖాన్ హత్య చేయబడ్డాడు. అసద్ ఖాన్‌కు నేర చరిత్ర ఉందని, అతని హత్య “పగ హత్య” అని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరిఫ్ జమాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2015లో నేషనల్ జనతా పార్టీ నుంచి రఘునాథ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అతను ఓడిపోయాడు. ఆ తర్వాత 2022లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఓడిపోయారు.