ఓ కుమారై త‌న తండ్రిని దారుణంగా హ‌త‌మార్చింది. డిన్న‌ర్‌కు తీసుకెళ్లి.. పుల్లుగా తాగించి కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ దారుణ ఘ‌ట‌న కోల్‌క‌తాలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు సర్కస్ పార్క్ సమీపంలో ఉన్న క్రిస్టోఫర్ రోడ్ లో ఓ మ‌హిళ తన కుటుంబంతో క‌లిసి నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి ఆమె త‌న తండ్రిని బ‌య‌ట‌కు తీసుకెళ్లింది. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి బాగా తాగించింది. కాసేపు అలా తిరిగొద్దామని చెప్పి చడ్పల్ ఘాట్ వద్దకు తీసుకొచ్చింది. హుగ్లీ నది ఒడ్డున 56ఏళ్ల తండ్రి అలా కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు. అదే అదునుగా బావించిన ఆ మ‌హిళ త‌న వెంట తెచ్చుకున్న కిరోసిన్ అత‌డిపై పోసి నిప్పంటించింది. అనంత‌రం అక్క‌డ నుంచి వెళ్లిపోయింది.

కాగా.. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డ ఉండే సీసీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. త‌న చిన్న‌తనంలోనే త‌న త‌ల్లి చ‌నిపోయింద‌ని చెప్పింది. అప్ప‌టి నుంచి త‌న తండ్రి నిత్యం శారీరకంగా దాడి చేయడంతో పాటు మానసికంగా హింసించేవాడని ఆమె పేర్కొంది. త‌న‌కు పెళ్లి జ‌ర‌గ‌డంతో అప్ప‌టి నుంచి ఈ అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని చెప్పింది. కాని కొన్ని కార‌ణాల కార‌ణంగా భ‌ర్త‌తో విడాకులు తీసుకుని ఇంటికి వ‌చ్చాన‌ని.. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ త‌న తండ్రి త‌న‌ను వేదించేవాడ‌ని ఆమె చెప్పింది. మార్చి 29న ఆమెను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story