బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ప్రేమ‌జంట‌.. చితిపైన పెళ్లి చేసిన పెద్ద‌లు

After death of Lovers marriage in Graveyard in Jalgaon.వారిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్ద‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 2:54 AM GMT
బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ప్రేమ‌జంట‌.. చితిపైన పెళ్లి చేసిన పెద్ద‌లు

వారిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌లేదు. పెద్ద‌ల‌ను ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక‌నో లేదా పెద్ద‌లు బాధ‌ప‌డ‌డం చూడ‌డం ఇష్టం లేక‌నో తెలీదు కానీ.. ఆ ప్రేమ జంట దారుణ నిర్ణ‌యాన్ని తీసుకుంది. ప్రేమికులిద్ద‌రూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. వారు చ‌నిపోయిన త‌రువాత వారి ప్రేమ‌ను అర్థం చేసుకున్న పెద్ద‌లు కనీసం వారి కోరిక‌ను అయిన తీర్చాల‌ని అనుకున్నారు. శ్మ‌శానంలోని చితిపైనే ఇద్ద‌రికి పెళ్లి చేశారు. అనంత‌రం వారిద్ద‌రిని ద‌హ‌నం చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని జ‌ల‌గావ్ జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. జ‌ల‌గావ్ జిల్లా వాడే గ్రామానికి చెందిన ముకేశ్ కైలాస్ సోనావోనా(22) పాల‌ట్ గ్రామానికి చెందిన నేహా బాపు(19) ప్రేమించుకున్నారు. అయితే.. వారి విష‌యం ఇరు కుటుంబాల్లో తెలిసింది. వారి ప్రేమ‌కు ఇరు కుటుంబాలు నిరాక‌రించాయి. నేహాకు పెళ్లి సంబంధాలు చూడ‌డం మొద‌లుపెట్టారు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక‌.. ప్రేమికులు ఇద్ద‌రూ ఓ దారుణ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. క‌లిసి బ్ర‌త‌క‌లేన‌ప్పుడు క‌నీసం క‌లిసి చావాల‌ని నిర్ణయించుకున్నారు. శ‌నివారం రాత్రి వాడే గ్రామంలోని ఓ పాఠ‌శాల‌లో ముకేశ్‌, నేహా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. చ‌నిపోయే ముందు ముకేశ్ వాట్సాప్ స్టేట‌స్‌లో బై అనే రాసుకున్నాడు.

ఆదివారం ఉద‌యం ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌రలించారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఎటువంటి సూసైడ్ నోటు ల‌భించ‌లేదు. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఇక శ్మ‌శాన‌వాటిక‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌ర్తించే ముందు ఇరు కుటుంబాల పెద్ద‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. మృత‌దేహాల‌కు వివాహం చేశారు. అనంత‌రం ఒకే చితిపై వారిని ద‌హ‌నం చేశారు.

Next Story
Share it