ఘోరం.. ఇంట్లోంచి లాక్కెళ్ళి.. కమెడియన్ దారుణ హత్య

Afghan comedian found murdered.అమెరికా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్ల‌డంతో ఆప్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2021 8:15 AM IST
ఘోరం.. ఇంట్లోంచి లాక్కెళ్ళి.. కమెడియన్ దారుణ హత్య

అమెరికా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్ల‌డంతో ఆప్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు. ఇప్ప‌టికే చాలా గ్రామాల‌ను ఆక్ర‌మించుకున్నారు. ప్ర‌జ‌ల‌ను క్రూరంగా హింసిస్తున్నారు. ఇంట్లోకి చొరబడి బలవంతంగా ఓ నటుడిని తీసుకెళ్లి.. అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేశారు. ఈ ఘ‌ట‌న స్థానికంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. తాలిబ‌న్లే క‌మెడియ‌న్ను చంపేసార‌ని మృతుడి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

అఫ్ఘనిస్తాన్ కాందహార్ ప్రావిన్స్ లో ఖాషా జ్వాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నాజర్ మొహమ్మద్ దారుణ హత్య సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. జులై 27 రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్ ఇంట్లోకి ప్రవేశించి గన్నులతో బెదిరించారు. అక్కడితో ఆగకుండా అతడిని బలవంతంగా బయటికి లాక్కెళ్ళారు. వద్దని వేడుకుంటున్నా కూడా వినలేదు. చొక్కా పట్టుకుని మరీ ఈడ్చుకెళ్ళారు. ఆ తర్వాత నాజర్ ని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. నాజర్ కమెడియన్ కావడానికి ముందు కాందహార్ ప్రావిన్స్ లో పోలీసు అధికారిగా పని చేసారు. అక్కడే ఆయనకు శత్రువులు ఉన్నారని తెలుస్తుంది. కచ్చితంగా తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది.

అయితే హత్యకు ముందు జరిగిన సంఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు విడుదలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో హాస్యనటుడిని చెంపదెబ్బ కొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చుట్టూ గన్స్‌తో కూర్చున్న వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. అత్యంత దారుణంగా హింసించి నాజర్‌ను చంపేసినట్లు తెలుస్తోంది. అక్కడ యుద్ధంతో దెబ్బతిన్న దేశ ప్రజలను తన హాస్యంతో నవ్వించిన పాపానికి ఈయన్ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు.

Next Story