భార్య, అత్తమామల దారుణ హత్య.. కొడుకుని చూడనివ్వలేదని..
ఓ యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేశాడు. అస్సాంలోని గోలాఘాట్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
By అంజి Published on 27 July 2023 8:00 AM ISTభార్య, అత్తమామల దారుణ హత్య.. కొడుకుని చూడనివ్వలేదని..
ఓ యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేశాడు. అస్సాంలోని గోలాఘాట్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. హత్య చేసిన అనంతరం నిందితుడు తన తొమ్మిది నెలల కొడుకుని వెంట తీసుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంజినీరింగు పూర్తిచేసిన నజీబుర్ రెహమాన్ బోరా (25)కు లాక్‌డౌన్ టైమ్‌లో సంఘమిత్ర ఘోష్ (24)తో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోల్‌కతాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
సంఘమిత్ర గర్భవతి అయ్యాక నజీబుర్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడే కొడుకుకి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి కుమారుడితో సహా సంఘమిత్ర తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. సంఘమిత్ర ఫిర్యాదుతో పోలీసులు నజీబుర్‌ను అరెస్టు చేశారు. బెయిలుపై బయటకువచ్చి నజీబుర్ కొడుకును చూసేందుకు వెళ్లాడు. అత్తమామలు సంజీవ్ ఘోష్, జును ఘోష్ అందుకు అనుమతించకపోవడంతో నబీబుర్ ఆగ్రహానికి లోనయ్యాడు. భార్యతోపాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు.
సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోలాఘాట్‌లో జరిగిన మూడు హత్యలు ‘లవ్ జిహాద్’ పరిణామమని, 15 రోజుల్లో ఛార్జిషీటు నమోదుచేసి నిందితుణ్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిలబెడతామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ బుధవారం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. నిందితుడిపై హత్య, ఇంటి చొరబాటు కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ తెలిపారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది.