ఓ యువతి ఆవేదన.. వాళ్లు అన్నలు కాదు.. కామాంధులు అంటూ
A young Woman molested by brothers. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతిపై సొంత అన్నయ్యలే చాలా కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 7 April 2021 10:43 AM ISTదేశంలో ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజు రోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. బయటి వారి నుంచే కాదు.. సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే మదనపడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతిపై సొంత అన్నయ్యలే చాలా కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. కన్నతల్లితో పాటు పెద్దమ్మ, పెదనాన్నలకు ఈ విషయం చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక వారి చేష్టలకు భరించలేని ఆ యువతి మంగళవారం కొత్తగూడెం రెండో పట్టణ పోలీసులకు ఆశ్రయించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ యువతి(20) తండ్రి ఆమె చిన్నతనంలోనే ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లీ చూసేది. ఆ యువతి చిన్నతనంలో వీరి కుటుంబం మణుగూరులో ఉండేది. ఆ యువతి 9వ తరగతి(2009) చదవుతున్నప్పటి నుంచే సొంత అన్నయ్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. కొన్నాళ్ల క్రితం అతడికి ఉద్యోగం రావడంతో అంతా కొత్తగూడెంకు వచ్చారు. యువతి పెద్దదైన అతడి ఆగడాలు ఆగలేదు సరికదా.. ఇంకా ఎక్కువ అయ్యాయి. దీంతో అన్నయ్య నుంచి తప్పించుకునేందుకు ఇంటర్ చదివే సమయంలో కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ కూడా వరుసకు అన్నయ్య అయిన పెద్దమ్మ కుమారుడు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా విషయం చెబితే.. చంపేస్తామని బెదిరించారు.
తల్లితో పాటు పెద్దమ్మ, పెదనాన్నలకు ఈ విషయాలను చెప్పినా వారు పట్టించుకోలేదు సరికదా.. నీచంగా మాట్లాడేవారు. ఇటీవల మెడిసిన్ ఎంట్రన్స్ శిక్షణ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినా.. లాక్‌డౌన్ సమయంలో మళ్లీ ఇంటికి వెళ్లక తప్పలేదు. ఆ సమయంలోనే ఆ యువతి అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రోజు రోజుకు అతడి వేదింపులు ఎక్కువ అవుతుండడంతో ఆ యువతి పోలీసులకు ఆశ్రయించింది. ఇద్దరు అన్నయ్యలతో పాటు తల్లి, పెద్దమ్మ, పెదనాన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.