'నన్ను వదిలి వెళ్లిపోయావా అమ్మా.. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు..?' కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
A Women suicide in KPHB.ఇన్నాళ్లు కుమారుడిని ఎంతో అపురూపంగా చూసుకున్న ఆ తల్లి..
By తోట వంశీ కుమార్ Published on 17 Jan 2023 2:35 AM GMTఆ దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. వీరికి ఏడేళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. అతడు అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. కుమారుడిని వద్దు అని అనుకున్నాడు. కుమారుడి మెర్సీ కిల్లింగ్ కోసం దరఖాస్తు చేసుకుందామని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే.. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను వదులు కునేందుకు ఆ మాతృమూర్తి మనసు అంగీకరించలేదు. భర్త కాళ్లా వేళ్లాపడింది. కుమారుడిని తాను పెంచుకుంటానని, చికిత్స చేయించుకుంటానని ఎంతగా చెప్పినా, భర్త, అత్తమామల పాషాణ హృదయాలు కరగలేదు. కాపాడాల్సిన వారే తన బిడ్డను కాటేయాలని చూస్తుంటే ఆమెకు దిక్కు తోచలేదు. ఇన్నాళ్లు కుమారుడిని ఎంతో అపురూపంగా చూసుకున్న ఆ తల్లి.. అతడిని వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శ్రీధర్‌కు సర్పవరం ప్రాంతానికి చెందిన స్వాతి(30)కి 2013లో పెళ్లైంది. వీరిద్దరూ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కేపీహెచ్‌బీ పరిధిలోని మంజీర మెజెస్టిక్ హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 7 ఏడేళ్ల వయసు ఉన్న బాబు ఉన్నాడు. అతడు మానసిక వికలాంగుడు. దీంతో శ్రీధర్‌తో పాటు అతడి తల్లిదండ్రులు బాబును ఎలాగైనా వదిలించుకోవాలని పట్టుబట్టారు. ఇందుకు స్వాతి అంగీకరించలేదు.
మెర్సీ కిల్లింగ్ కోసం శ్రీధర్.. స్వాతిపై ఒత్తిడి తెచ్చేవాడు. భర్త ఎంత ఒత్తిడి తెచ్చిన కన్న కొడుకును చంపుకునేందుకు స్వాతి ఇష్టపడేది కాదు. అతడి ప్రతిపాదనను ఎప్పటికప్పుడు తిరస్కరించేది. రోజు రోజుకి భర్త, అతడి కుటుంబ సభ్యుల వేధింపులు తీవ్రం అవుతుండడంతో స్వాతి మానసికంగా కుంగిపోయింది. ఆదివారం రాత్రి అపార్ట్‌మెంట్ 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. భార్య మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కూడా భర్త శ్రీధర్, అతడి కుటుంబసభ్యులు అందుబాటులో లేరు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.