హైదరాబాద్ నగరంలోని స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లోని పని చేసే ఓ మహిళా, కస్టమర్ దగ్గర ఉన్న రూ.30.69 లక్షల విలువైన డైమండ్ రింగ్‌ను అపహరించి, పట్టుబడతామనే భయంతో టాయిలెట్ కమోడ్‌లో పడేసిందని పోలీసులు సోమవారం తెలిపారు. విచారణ సమయంలో.. పోలీసులు ప్లంబర్ సహాయంతో కమోడ్‌ను అనుసంధానించే పైప్‌లైన్ నుండి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళా ఉద్యోగిని "దొంగతనం" కేసు కింద అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు (ఒక మహిళ) జుట్టు తొలగింపు కోసం గత వారం జూబ్లీహిల్స్‌లోని ఓ క్లినిక్‌కి వెళ్లింది. జుట్టు తొలగింపు ప్రక్రియను చేపట్టిన మహిళా సిబ్బంది, ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని ఒక పెట్టెలో ఉంచమని కోరింది. ఆమె ఇంటికి చేరుకున్న తర్వాతే ఫిర్యాదుదారు క్లినిక్‌లో తన ఉంగరాన్ని మరచిపోయానని గ్రహించి, దాని గురించి సిబ్బందిని విచారించింది. ఆ తరువాత పోలీసు ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
పోలీసులు విచారణ చేపట్టి, సిబ్బందిని ప్రశ్నించగా, మహిళా ఉద్యోగి (ఉంగరాన్ని ఎత్తుకెళ్లింది) తానే ఉంగరాన్ని దొంగిలించి తన పర్సులో ఉంచుకున్నట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. అయితే పోలీసులకు చిక్కుతాననే భయంతో క్లినిక్‌లో ఉన్న వాష్‌రూమ్‌లోని కమోడ్‌లో దానిని విసిరినట్లు ఆమె తెలిపింది.