తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలోని కోవిల్‌పట్టి అటవీ ప్రాంతంలో 42 ఏళ్ల వ్యక్తి కాలిపోయిన మృతదేహాం లభ్యమైంది. మృతదేహాం దగ్గర దొరికిన ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ మహిళను, ఆమె 15 ఏళ్ల కుమార్తెతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. డెడ్ బాడీ దొరికిందన్న సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పసువంధాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు గురైన వ్యక్తిని చేపల వ్యాపారి జ్ఞానశేఖర్‌గా గుర్తించారు. పోలీసులు ఆ వ్యక్తి భార్య, 14, 15 సంవత్సరాల వయస్సు గల ఆమె ఇద్దరు కుమార్తెలను విచారణ కోసం తీసుకెళ్లారు. విచారణలో కుటుంబసభ్యులు పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. చివరకు ఆ వ్యక్తిని కుటుంబసభ్యులే హత్య చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం నాడు జ్ఞానశేఖర్, అతని భార్య మధ్య గొడవ జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి ఇరుగుపొరుగు వారిని విచారించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, తన పెద్ద కుమార్తె కార్తీక్ అనే 24 ఏళ్ల యువకుడితో సంబంధం పెట్టుకుందని జ్ఞానశేఖర్ అనుమానం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో జ్ఞానశేఖర్ భార్య, కుమార్తె ఇద్దరినీ మందలించాడు. ఈ క్రమంలోనే మహిళ, ఆమె కుమార్తె జ్ఞానశేఖర్‌ను చంపారు. అనంతరం తల్లీకొడుకులు కార్తీక్ సహాయంతో జ్ఞానశేఖర్‌ను గోనె సంచిలో చుట్టి మృతదేహాన్ని తగులబెట్టి అటవీ ప్రాంతంలో పడేశారు. జ్ఞానశేఖర్ హత్యకేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.