వచ్చే నెలలో పెళ్లి.. ఇంజక్షన్‌ వేసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో 26 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వచ్చే నెలలో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.

By అంజి
Published on : 13 Feb 2024 10:26 AM IST

student, Mamata Medical College, suicide, Crime news

వచ్చే నెలలో పెళ్లి.. ఇంజక్షన్‌ వేసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో 26 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వచ్చే నెలలో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం హెచ్‌ఐజీ కాలనీకి చెందిన రచనారెడ్డి ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ఆమె బాచుపల్లి మమత ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది.

సోమవారం ఉదయం రచన తన ఇంటి నుంచి కారులో బయలుదేరింది. ఆమె పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వైపు వెళ్లినట్లు సమాచారం. ఈ ప్రయాణంలోనే కారు కదులుతున్న సమయంలో ఆమె ఎడమ చేతికి గుర్తు తెలియని ఇంజక్షన్ వేసుకుంది. అనంతరం ఆమె స్పృహ కోల్పోవడంతో కారు అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డిపేట వద్ద ఔటర్‌ రెయిలింగ్‌ను ఢీకొని రోడ్డుపైకి దూసుకెళ్లింది.

మరో వాహనంలో వెళ్తున్న వ్యక్తి కారును గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. రచనను బాచుపల్లి మమత ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. తన ప్రాణాలను తీసుకోవాలని రచన తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పరిస్థితులు అస్పష్టంగానే ఉన్నాయి. మార్చిలో జరగనున్న ఆమె పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై రచన తండ్రి ప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story