Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. ఆన్‌లైన్‌లో విషం కొనుక్కుని..
నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
By అంజి Published on 13 Dec 2024 11:25 AM ISTHyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ చేసి..
హైదరాబాద్: నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. భర్త వేధింపులు భరించలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భారీగా కట్నం ఇచ్చి.. ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తన కూతురు.. శవమై తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. నాగలక్ష్మి అనే యువతికి మనోజ్ అనే వ్యక్తితో గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నాగలక్ష్మి తల్లిదండ్రులు వివాహం సమయంలో భారీగా కట్నకానుకలు ఇవ్వడంతో పాటు ఘనంగా వివాహం జరిపించారు. నాగలక్ష్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. భర్త మనోజ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నారు.
ఈ జంట మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్ది రోజుల నుండి నాగలక్ష్మికి భర్త నుండి వేధింపులు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త వేధింపులు రోజురోజుకి మితి మీరి పోవడంతో నాగలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో నాగ లక్ష్మి చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ చేసి.. దానిని తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే నాగలక్ష్మి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. భర్త వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.