జైలులో దారుణం.. మహిళా డాక్టర్‌పై ఖైదీ అత్యాచారం, హత్యకు యత్నం

A prisoner raped a female doctor in a jail in Delhi.

By అంజి  Published on  28 Sep 2022 8:34 AM GMT
జైలులో దారుణం.. మహిళా డాక్టర్‌పై ఖైదీ అత్యాచారం, హత్యకు యత్నం

దేశ రాజధాని ఢిల్లీలోని మండోలి జైలులో దారుణం వెలుగు చూసింది. సోమవారం ఓ ఖైదీ అక్కడ ఉద్యోగం చేస్తున్న 31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపేందుకు ప్రయత్నించాడు. మహిళలపై నేరాలకు పాల్పడిన రెండు కేసుల్లో జైలుకెళ్లిన నిందితుడు జైలుకు వచ్చిన మహిళా వైద్యురాలిపై అత్యాచారయత్నం చేశాడు. సోమవారం జూనియర్ రెసిడెంట్ డాక్టర్ ఖైదీలందరినీ క్రమం తప్పకుండా చెక్‌ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మండోలి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26న ఈ ఘటన జరిగింది. బాధితురాలికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

''నిందితుడు బాత్‌రూమ్‌లో దాక్కుని, ఆ తర్వాత ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అయితే డాక్టర్ గట్టిగా కేకలు వేసి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఆమె అతడిని తోసేసి బయటకు పరుగెత్తిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఖైదీని వెంటనే పట్టుకున్నారు'' అని జైలు అధికారి తెలిపారు. నిందితుడిపై అత్యాచారం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు. సుబ్రత్ పిళ్లై అనే నిందితుడు గతంలో ఒక కేసులో ఏడాదిపాటు జైలులో శిక్ష అనుభవించాడు. కోర్టు అతడికి 10,000 జరిమానా విధించింది.

మండోలి జైలులోని మహిళా వైద్యురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనకు సంబంధించి మండోలి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ నుండి హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) (ఈశాన్య) ఎస్‌కె సైన్ తెలిపారు. పోలీసులు ఇప్పుడు నిందితుడిపై 376 (అత్యాచారం), 511 (యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఇతర కారాగార శిక్షతో కూడిన నేరాలకు పాల్పడే ప్రయత్నం చేసినందుకు శిక్ష), 307 (హత్యకు ప్రయత్నించడం) కింద మరో కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బ్యారక్ చుట్టూ భద్రతను పెంచినట్లు జైలు అధికారులు తెలిపారు.

Next Story