Hyderabad: అరబ్ దేశాల్లో ఉద్యోగాలంటూ.. మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

అరబ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  10 July 2024 9:00 AM IST
fraud, jobs, Arab countries, arrest

Hyderabad: అరబ్ దేశాల్లో ఉద్యోగాలంటూ.. మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

అరబ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని.. బ్యాంక్ అధికారులమని.. వ్యాపారంలో పెట్టుబడులు అంటూ.. అధిక వడ్డీ ఇస్తామంటూ.. ఇలా రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. వారి మాటలు నమ్మి మోసపోకండి అంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి మోసాలకు చదువుకున్నవారే బాధితులుగా మారుతున్నారు. సైబర్ కేటుగాళ్ల చేతుల్లో చిక్కుకొని లక్షల్లో డబ్బులు కోల్పోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు సైబర్ కేటుగాడి చేతిలో మోసపోయి రూ.లక్షల్లో డబ్బులు నష్టపోయాడు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన నిశాంత్ కుమార్ రాయ్ (31) అనే వ్యక్తి కేవలం నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని కాల్ సెంటర్‌ను నడుపుతూ..‌ అరబ్‌ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ అమాయకపు ప్రజలకు గాలం వేశాడు. నిందితుడు నితిన్ కుమార్ రాయ్ షైన్.కామ్, టైమ్స్ జాబ్స్.కామ్, నౌక్రి.కామ్ వెబ్ సైట్ల నుండి నిరుద్యోగుల డేటాను సంపాదించాడు. తాను పెట్టిన కాల్ సెంటర్ నుండి అభ్యర్థులకు కాల్ చేసి అరబ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, వీసా ఫీజు ఇలా రకరకాల కారణాలు చెప్పి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు.

అంతేకాకుండా ఈ కేటుగాడు నకిలీ సిమ్ కార్డులతో పాటు రకరకాల బ్యాంకు ఖాతాలను కూడా తెరిచాడు.. అయితే ఈ కేటుగాడు వేసిన వలలో హైదరాబాద్‌లోని కోఠికి చెందిన ఓ బాధితుడు చిక్కాడు. అరేబియా జెజాన్ యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితుడికి కాల్ సెంటర్ నుండి ఫోన్ వచ్చింది. అది నిజమని నమ్మిన బాధితుడు నిందితుడు చెప్పిన విధంగా చేశారు. ఇందు కొరకు ప్రాసెసింగ్ ఫీజు, వీసా ఫీజు మొదలగు కారణాలు చెప్పి బాధితుడి వద్ద నుండి నాలుగు లక్షల 71 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సైబర్ చీటర్.. ఆ తర్వాత బాధితుడు ఫోన్ చేసినా కూడా చీటర్ ఫోన్ లిఫ్ట్ చేయక పోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి నిందితుడు నిశాంత్ కుమార్ రాయ్ ఈ మోసా లకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఇతను నోయిడా యూపీలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని.. ప్రముఖ జాబ్‌ వెబ్‌సైట్‌ నుండి నిరుద్యోగుల వివరాలు సేకరించి వారికి కాల్ చేసి అరబ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి రకరకాల ఫీజుల కారణాలు చెప్పి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు నిశాంత్ కుమార్ రాయ్ ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 6 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్ ఫోన్లు, 5 బీటెల్ వైర్లెస్ ఫోన్లు, 6 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

Next Story