దారుణం.. కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని చెట్టుకు ఉరేసి తగులబెట్టారు

A Man was burnt after hanging to death in nizamabad. భూవివాదం గురించి ఇవాళ కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని కొందరు దుండగులు అతి దారుణంగా హతమార్చారు.

By అంజి  Published on  20 July 2022 3:51 PM IST
దారుణం.. కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని చెట్టుకు ఉరేసి తగులబెట్టారు

భూవివాదం గురించి ఇవాళ కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని కొందరు దుండగులు అతి దారుణంగా హతమార్చారు. ఆ వ్యక్తిని చెట్టుకు ఊరేసి తగులబెట్టారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా రామచంద్రపల్లి గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దింట్ల పోశెట్టి (47) తన భార్య, ఇద్దరు పిల్లలతో రామచంద్రపల్లిలో నివసిస్తున్నారు. అయితే నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పోశెట్టి తిరిగి ఇల్లు చేరలేదు. దీంతో ఫోన్‌ చేయగా.. ఆర్మూర్‌ వెళ్లాను, సాయంత్రం వరకు వస్తానని కుటుంబ సభ్యలుకు చెప్పాడు. రాత్రైనా పోశెట్టి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటికే కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

ఇవాళ ఉదయం రామచంద్రపల్లి శివారు, జాతీయ రహదారి పక్కన పోశెట్టి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడిని చెట్టుకు ఊరేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేశారు. మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘ‌ట‌నాస్థ‌లిని నిజామాబాద్ ఏసీపీ వెంక‌టేశ్వ‌ర్లు ప‌రిశీలించారు. నిన్న రాత్రి 7:30 గంట‌ల స‌మ‌యంలో పోశెట్టి హ‌త్య‌కు గురై ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక పరమైన తగాదాలతో పాటు భూవివాదాల్లో పోశెట్టి ఉన్నాడని.. ఇదే విషయమై ఇవాళ కోర్టుకు వెళ్లాల్సి ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నలుగురు వ్యక్తులపై అనుమానం ఉందన్న ఫిర్యాదుతో గాలింపు చేపట్టారు.

Next Story