హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్ ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దోమలగూడ పోలీసులు క్లూస్ టీం తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తిని హత్య చేసి లిఫ్ట్ లో పడివేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసుల అనుమానిస్తున్నారు.
క్లూస్ టీంతో కలిసి దోమలగూడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. హత్యకు గల కారణాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తూ.. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.