ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరకు వివాహిత నోట్లో పురుగుల మందు పోశాడు
విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఓ వివాహితను వెంబడించాడు.
By - అంజి |
ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరకు వివాహిత నోట్లో పురుగుల మందు పోశాడు
విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఓ వివాహితను వెంబడించాడు. ఆమె భర్తకు తప్పుడు మాటలు చెప్పి ఇద్దరినీ విడగొట్టాడు. చివరకు వివాహితను ఒత్తిడికి గురి చేసి తన గదికి తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత వివాహిత వేరే యువకుడితో మాట్లాడుతోందని అనుమానించి ఆమె గొంతులో బలవంతంగా పురుగుల మందు పోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి గత సంవత్సరం పెళ్లైంది. ఆ తర్వాత పరిచయస్థుడైన భవానీశంకర్ లవ్ చేస్తున్నానంటూ ఆమె వెంట పడ్డాడు. ఆమె భర్తకు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పి, వారిద్దరి మధ్య గొడవలు చేశాడు. దీంతో వివాహిత తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. విజయవాడలో నర్సింగ్ కోర్సులో చేరేందుకు ట్రైనింగ్ తీసుకుంటూ ఉండడంతో భవానీశంకర్ ఆమె వెంట పడి మ్యారేజ్ చేసుకుంటానని వేధించడం మొదలుపెట్టాడు. వివాహిత వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను హైదరాబాద్‌లో ఒక హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు యువతి ఇన్‌స్టా ఐడీ తెలుసుకున్న అతడు.. ఆమె వివరాలు తెలుసుకుని తరచూ ఫోన్‌లో వేధింపులకు గురి చేశాడు.
పెళ్లి చేసుకుంటానని తరచూ ఒత్తిడి చేయడంతో నిందితుడిని మాటలు నమ్మి యువతి ఈ నెల 2న హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చింది. భవానీశంకర్ ఆమెను దేవీనగర్‌లోని తన గదికి తీసుకొచ్చాడు. ఆ తర్వాతి రోజు యువతి ఫోన్‌ను చెక్ చేయగా, అందులో మహేష్ అనే యువకుడి ఫోన్ నంబరు ఉండడంతో ఆమెను భవానీ శంకర్ అనుమానించాడు. ఆమె దాడికి పాల్పడ్డాడు. ఆమె హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లగా మళ్లీ ఆమెను తన రూమ్‌కి తీసుకొచ్చాడు. ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి హత్యకు యత్నించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించి తల్లికి సమాచారం ఇచ్చి పరారయ్యాడు. దీనిపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.