West Godavari: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం నాడు జరిగింది.
By అంజి Published on 20 Aug 2023 2:45 AM GMTWest Godavari: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం నాడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆకివీడు 14 వ వార్డులో నివసిస్తున్న మారడుగుల వీరవెంకట సత్యనారాయణ పెద్ద కుతూరు సంధ్యారాణి అదే ప్రాంతానికి చెందిన వాడపల్లి రాంబాబును ప్రేమించింది. 3 ఏళ్ల కిందట వీరు వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం 18 నెలల బాబు ఉన్నాడు. రాంబాబు గొలుసు చోరీ కేసులో జైలుకు వెళ్లాడు. దీంతో సంధ్యారాణి(24) తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
కుమారుడితో సహా పుట్టింటికి వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఇటీవల జైలు నుంచి విడుదలైన రాంబాబు తన భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ తన భార్యతో గొడవపడి బిడ్డను తనకు ఇచ్చేయాలని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే శనివారం నాడు ఉదయం తండ్రితో కలిసి స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన సంధ్యారాణిని.. తిరిగి వెళ్తుండగా భర్త రాంబాబు అడ్డుకున్నాడు. నడిరోడ్డుపైనే కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న ఆమె తండ్రి ఈ ఘటనను చూసి దగ్గరకు వచ్చేసరికి రాంబాబు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. హత్య అనంతరం రాంబాబు ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలియడంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని అక్కడికి తరలించి ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ శ్రీనాథ్‌లు హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.